Wednesday, 6 December 2017

తెలుగు కవిత్వంలో వినూత్న ప్రయోగం - కవిసంగమం

‘‘నువ్వొక పచ్చని చెట్టువైతే
పిట్టలు వాటంతటవే వచ్చివాలేను‘‘
జయహో కవిత్వం
తెలుగు కవిత్వంలో వినూత్న ప్రయోగం - కవిసంగమం
కవిసంగమం దాటి వచ్చిన మైలురాళ్ళు
మూడు తరాల కవుల మధ్య వారధిగా
తెలుగు కవిత్వ పురోగతికి సారధిగా
తెలుగు కవిత్వంలో కొత్త ప్రయోగం – కవిసంగమం
కవిసంగమం గురించి గజల్ బాణీలో చెప్పాలంటే...
’’తెలుగు కవిత నుదుటిపైన వెలుగుతున్న జాబిల్లే కవిసంగమం
పిట్టలెన్నో కట్టుకున్న పచ్చపచ్చ పూరిల్లే కవిసంగమం
కొత్తకలం కురిపించే సాహిత్యపు చిరుజల్లే కవిసంగమం
ముఖపుస్తక గగనంలో అక్షరాల హరివిల్లే కవిసంగమం
చిన్నగీత మెరుపుతీగై నేడెన్నో వెలుగుపూలు పూస్తున్నదీ
పెనుచీకటి దారంతా పరచుకున్న మిణుగురులే కవిసంగమం
కొత్తదైన ప్రయోగం మెచ్చదగిన ఫలితాలను ఇస్తున్నదీ
చేయిపట్టి దారిచూపే కాలిబాట పిలుపేలే కవిసంగమం
బంజరైన కవనవనంలో తొలకరి కురిసినంత హాయిహాయీ
ఈ కవిత్వ సేద్యంలో కొత్తవాన చినుకేలే కవిసంగమం
గుండెలోని ఆవేదన ఆగ్రహాల గాయాలే దీపాలుగా
వెలుగుతున్న కవితలకు ఊపిరూదె చమురులే కవిసంగమం‘‘
కవిసంగమం ఫేస్‌బుక్‌ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన, సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పడిన సమూహం. కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు - ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా ‘‘కవిసంగమం’’ సీరీస్‌ సభలు ‘‘పోయెట్రీ వర్క్‌ షాపుల్లా” జరుగుతున్నాయి. వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్‌ వాల్‌ మీద పోస్టు చేయడం, నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’ మార్గంలో సాగుతోంది .
కవిసంగమం గురించి రాసిన ఈ రెండు కవితలు చూడండి :
• రాఘవ రెడ్డి రాసిన ‘‘నువ్వొక పచ్చని చెట్టువైతేను..’’ అనే కవిత .
రెండేళ్ళక్రితంఇక్కడొక మొక్క మొలిచింది
పచ్చని చెట్టై ఎదిగింది..
పిట్టలన్నీ వాటంతటవే వచ్చివాలాయి
పాటలెన్నో పాడాయి
పాడుతూనే వున్నాయి
పాటలెన్నో విన్నాయి
వింటూనే వున్నాయి
పాటపాటకూ పదునెక్కుతోన్న గళాలు
పదిమందికీ పంచుతోన్న కవన పరీమళాలు
భావార్ద్ర మేఘాలై సంచలిస్తున్నాయంతటా..
ఉత్తమాభిరుచి గల ఏ శీతల పవనమో
భుజం తట్టినపుడుఎదురైన ఏ అనుభవమో
అనుభూతి సాంద్రమై మెరిసినప్పుడు
వ్యవస్థ చేసిన గాయమేదో ఓపలేనంతగా సలిపినప్పుడు..
ఆనందమో విషాదమో
ఆవేశమో ఆగ్రహమో
ఆలాపనో ప్రేలాపనో
వెన్నాడినపుడు వేటాడినపుడు
కదిలించినపుడు కరిగించినపుడు..
భావమేఘం బరువెక్కుతుంటేను
కొత్త కవితై ఇల జారుతుంటేను..
సృజనదేవి పెదవులపైచిరుహాసమొచ్చేను..
నువ్వొక పచ్చని చెట్టువైతేను
పిట్టలు వాటంతటవే వచ్చివాలేను
(కవి సంగమం లో రాస్తున్నవాళ్ళకు, కవిసంగమాన్ని చూస్తున్న వాళ్లకు, కవిసంగమాన్నిలా చేస్తున్న వాళ్ళకు)
వరప్రసాద్‌ రాసిన మరో కవిత
• ‘కవి ఒక సమూహం అనే ఒక కవి సంగమం’’
ఫేస్‌బుక్‌ కవిసంగమంలో కవితాక్షరాల కవాతు
తెలుగు అక్షరాలు అలవోకగా ఇంటర్నెట్‌లో ఒదిగిపోతూ
వేలకోట్ల నక్షత్రాలను పుట్టించబోతున్నాయి
అక్షరాలంటే ఐక్యతా ప్రతీకలు
ఒంటరిగా ఏ అర్థాన్నీ ఇవ్వవు.
అక్షరాల కలయిక ఒక అనివార్యం.
అక్షరాలకు అర్థం కల్పించేవాడు కవి.
అక్షరాలతో ఆలోచనలను పండిరచేవాడు కవి.
అక్షరాలను ప్రేమతో ఆర్తితో అలంకరించి నెత్తిన పెట్టుకుని లోకమంతా తిరిగేవాడు.
కవితను పరవశించి పలవరించి అందరిలో ఐక్యమయ్యేవాడు కవి.
ఈనాటి కవి సాంకేతికుడయ్యాడు.
ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కవితా పతాకాన్ని ఎగరేస్తున్నాడు.
కవి సంగమం కొత్త ను హత్తుకుంటున్న తెలుగు కవితా సంతకం.
ఆధునిక కవితా యాత్ర నాగరికతా శిఖరాన మెరుస్తున్న తెలుగు అక్షర వెలుగు సంకేతం.
కవి ఒక సమూహం.
కవి సంగమం ఒక ప్రతిబింబం.
కవిత్వాన్ని పండించే ఆధునిక వ్యవసాయం
కంప్యూటరూ... కవితా సేద్యం. ఈనాటి సందర్భం
అంతరంగాల సముద్రాలకు, అనంతభావాల కలబోతకు ఆధునిక వేదిక
ఫేస్‌బుక్‌ . కవిసంగమాన్ని ఆనందంగా అందరం ఆలింగనం చేసుకుందాం!
* ఈ కవితల్లో ‘‘కవిసంగమం ’’ ఉద్దేశించిన అనేక అంశాలు అవగతమవుతాయి. వారంలో ప్రతిరోజూ కవిత్వం గురించిన విభిన్న అంశాల గురించి ‘‘శీర్షికలు’’ రాయించడం. అలాగే గ్రూప్‌ లో రాస్తున్న వారికి ఈ క్రింది విధంగా సూచనలు ఇస్తూ , వారిని మరింతగా కవిత్వసృజన గురించి అవగాహన చేసుకోవడానికి పురికొల్పడం జరుగుతోంది.
మిత్రులారా !
‘‘కవిసంగమం’’ లో రాస్తున్న కవిత్వం చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది.
* కవిత రాయగానే వెంటనే పోస్ట్‌ చెయ్యకండి. కొంచెం మరొక్కసారి చూసుకుని. ఏమైనా మార్చాలనిపిస్తే లేదా ఎక్కడైనా భావం చెప్పేటప్పుడు అది పాఠకుడికి చేరే దశలో అర్థం సరిగా చేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించి తిరగారాయండి.
* కవిత్వంలో గాఢత అవసరం. మనలోకి ప్రసరించిన అనేక విషయాలను వడపోసి ,చిక్కబరిచి చెప్పే ఒకానొక ప్రక్రియ. వ్యర్థపదాలు, పునరుక్తులు లేకుండా ఒక భావాన్ని అనుభూతి ప్రధానంగా చెప్పే ప్రక్రియ. కాబట్టి కవిత్వనిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనబరచండి.
* కవిత్వం విరివిగా చదవండి. కవిత్వ సంకలనాలు సంపాదించి చదవండి. కవిత్వానికి సంబందించిన పుస్తకాలు చదవండి. అధ్యయనం చాలా అవసరం.
* ఎవరైనా మీరు రాసే కవిత్వం పైన తగు సూచనలు చేస్తే, వాటిని వినమ్రంగా స్వీకరించండి. అది మీ ఉన్నతికి, కవిత్వ ఎదుగుదలకు ఉపకరిస్తుంది. (మేం ఏం రాసినా అదే గొప్ప, దీనిపై ఎవరూ ఏం చెప్పక్ఖర్లేదనే భావనను పెంపొందించుకోకండి .కవి ఎంత ముఖ్యుడో ,పాఠకుడూ అంతటి ముఖ్యుడే. పాఠకుడు లేకపోతే కవిత్వం చేరేదేక్కడికి? కవింకవిత్వరొ పాఠకుడు అని గుర్తుంచుకోవాలి) కవికి తనదైన ఒక సొంత గొంతు, మార్గం ఉంటుంది. దానిని వీడకుండా మీదైన ఒకానొక ప్రత్యేక పద్ధతిలోనే మీరు రాయండి. మీరు మరొకరిలాగా రాయకండి. ఒకే వస్తువును ఏ ఇద్దరూ ఒకలా రాయరు. ప్రతి ఒకరికీ తమదైన శైలి ఉంటుంది.
ఫే˜స్‌ బుక్‌ లో ‘‘కవిసంగమం’’ చేస్తున్న పని - ప్రతి ఒక్కరిలో ఉన్న కవిత్వం రాయాలన్న కాంక్షను గౌరవించి, వారి రాతలకు వేదికలా నిలబడటం. అలా రాస్తూ రాస్తూ కవిత్వసృజనలో పరిణతిని సాధిస్తూ ఉండటాన్ని, నిండుమనసుతో స్వాగతించడం, సంతోషించడం.
‘‘కవిసంగమం’’ చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం కవిత్వం మీదున్న ఇష్టమూ, అభిమానం వల్లనే ! అందువల్ల ‘‘కవిసంగమం’’ నుండి ఏవైనా సూచనలు, అభిప్రాయాలు చెబుతున్నప్పుడు, వాటిని గౌరవిస్తూ పాటించడానికి ప్రయత్నిచండి. ఇదంతా మనందరి కవిత్వం కోసం, కవిత్వం రాసే మీ కోసం !
జయహో !
‘‘కవిత్వం కావాలి కవిత్వం !! ’’
1`
కవిసంగమం ప్రయాణం - కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌
.......................................................................
• ఫిబ్రవరి 9, 2012 - కవిసంగమం మొదలయ్యింది. ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్‌ బుక్‌ కవితావేదికగా నిలబడిరది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు -వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్‌ చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది. ఆగష్టు 15, 2012 న ఇఫ్లూ లో జరిగిన ‘‘కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌’’ ఒక గొప్ప ప్రయోగం. ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, దక్కన్‌ క్రానికల్‌, హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా, ఒక ప్రయోగంగా 144 కవితలతో ‘‘కవిసంగమం-2012 ’’ కవితా సంకలనం వెలువడిరది . ఇందులో తొట్టతోలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ఈ ప్రోత్సాహంతో ముందు ముందు ఇంకా మెరుగైన కవిత్వం రాస్తారని ఆకాంక్ష.
• బెంగాలీ కవి సుబోధ్‌ సర్కార్‌ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్‌ ను చూసి ముచ్చటపడ్డాడు. గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు. అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆమధ్య వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్‌ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు, చదివిన కవిత్వం మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌ ’ గా ఉపయోగపడ్డాయి.
ఈ ‘‘లర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’కు కొనసాగింపుగా 2013లో మొదలుపెట్టిన మూడుతరాల కవుల ‘‘లామకాన్‌ లో కవిసంగమం’’ కార్యక్రమం! ఆరు కార్యక్రమాలు అక్కడ ముగించుకున్నాక ‘‘గోల్డెన్‌ త్రెషోల్డ్‌’’లో మిగతా సీరీస్‌ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం, కొత్తగా రాస్తునవాళ్ళు ప్రత్యక్షంగా సీనియర్‌ కవులను కలవడం
* వారి కవిత్వానుభావాల్ని వినడం, కవిత్వ రహాస్యాలను తద్వారా అవగతం చేసుకోవడం.
* అలాగే తామూ చదవడం, రాయడం ,
* కవిత్వం వినడం ,
* కవిత్వం చదవడం
* కవిత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవడం
* తమను తాము ఇంప్రూవ్‌ చేసుకోవడం ,
* పాల్గొంటూ, వింటూ నేర్చుకోవడం -
2013 లో ‘‘కవిసంగమం’’ కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి.
* నెల నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇతర కవులతో కలవడం,కవిత్వ వాతావరణంలో గడపడం - వంటి ఈ కవిసంగమం ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’ కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు.
1. ఒక ప్రముఖ కవి.
2. ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, ‘‘కవిసంగమం’’లోనూ రాస్తున్న కవి.
3. ముగ్గురు ప్రవర్థమాన కవులు
ఈ సంరంభంలో పాల్గొన్న కవులు
వేదిక :లామకాన్‌
* జనవరి 27- నగ్నముని, వసీరా, కిరణ్‌ గాలి, మెర్సీ మార్గరెట్‌, చింతం ప్రవీణ్‌ .
* ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్‌, పులిపాటి గురుస్వామి, నందకిషోర్‌, జయశ్రీనాయుడు, క్రాంతి శ్రీనివాసరావు
* మార్చి 9 - విమల, బివివి ప్రసాద్‌, యజ్ఞపాల్‌ రాజు, శాంతిశ్రీ, చాంద్‌ ఉస్మాన్‌
* ఏప్రిల్‌ 13 -వరవరరావు, కాసుల లింగారెడ్డి, అనిల్‌ డానీ, మెరాజ్‌ ఫాతిమా, నరేష్‌ కుమార్‌
* మే 11 - దేవిప్రియ, కోడూరి విజయకుమార్‌, సివి సురేష్‌, వనజ తాతినేని, బాలు వాకదాని
* జూన్‌ 8 - అమ్మంగి వేణుగోపాల్‌ , రెడ్డి రామకృష్ణ, మొయిద శ్రీనివాసరావు, రాళ్ళబండి శశిశ్రీ, తుమ్మా ప్రసాద్‌
వేదిక : ‘‘గోల్డెన్‌ త్రెషోల్డ్‌ ’’
* జూలై 13 - శీలా వీర్రాజు, సత్యశ్రీనివాస్‌, లుగేంద్ర పిళ్ళై, సొన్నాయిల కృష్ణవేణి, కృపాకర్‌ పొనుగోటి
* ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, దాసరాజు రామారావు, కాశిరాజు, పూర్ణిమా సిరి, శ్రీకాంత్‌ కాన్టేకర్‌
* సెప్టెంబర్‌ 14 - దీవి సుబ్బారావు, కుమారవర్మ, భాస్కర్‌ కొండ్రెడ్డి, భార్గవి జాలిగామ, పోతగాని
* అక్టోబర్‌ 5 (మొదటి శనివారం) -పాపినేనిశివశంకర్‌ , శ్రీ నివాస్‌ వాసుదేవ్‌, వర్చస్వి, రమాసుందరి, నాయుడుగారి జయన్న
* నవంబర్‌ 9 -నందిని సిధారెడ్డి, జాన్‌ హైడ్‌ కనుమూరి, మోహన్‌ రావిపాటి, కవితా చక్ర, బాలసుదాకర మౌళి ......
* కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడం లేదనే దశ నుంచి అనేక కొత్త గళాలతో ‘‘కవిసంగమం’’ నువ్వొక పచ్చని చెట్టయితే, పక్షులు వాటంతటవే వచ్చి వాలేను’’ అన్న మాటను నిజం చేసి చూపింది. 2012లో ‘‘ఇఫ్లూ’’ లో జరుపుకున్న ‘‘కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌’’లా 2013లో కూడా డిసెంబర్‌ 15 న జరుపుకుంది. ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొ.శితాంషు యశస్చంద్ర గారు పాల్గన్నారు. ప్రారంభసభలో సంపాదకులు కే.శ్రీనివాస్‌, ఎం.వి.ఆర్‌.శాస్త్రి, 10టి.వీ., సి.ఇ.వో అరుణ్‌ సాగర్‌, అనురాగ్‌ విద్యాసంస్థల రాజేశ్వర్‌ రెడ్డి లు పాల్గొనగా, ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు.
* జనవరి 25న పొరుగు రాష్ట్రాల కవయిత్రుల సమ్మేళనం నిర్వహించాం.
* తమిళ కవయిత్రి సల్మ, కన్నడ కవయిత్రి మమత సాగర్‌, హిందీ కవయిత్రి రతి సక్సేనా పాల్గొని, కవిత్వం వినిపించారు. సల్మాపై చిత్రించిన డాక్యుమెంటరీ ప్రదర్శన, మమతా సాగర్‌ కవితా సంపుటి ‘‘హైడ్‌ అండ్‌ సీక్‌’’ పరిచయం జరిగాయి..
* కవిత్వానికి ఒక వేదికగా ‘‘కవిసంగమం’’ఉండేలా, ఫేస్బుక్‌ లో రాస్తున్న ఔత్సాహిక కవులకు ఇదొక ‘‘పోయెట్రీ వర్క్‌ షాప్‌’’లా ఉపయోగపడేలా ఇన్నాళ్ళుగా ఇది పనిచేస్తూ వచ్చింది.. ఇలా నిర్మించడంలో ఎంతో ఓపిక, సమయమూ వెచ్చించి కష్టతరమైన పనిగానే ఇన్నాళ్ళలో అన్పించినా, కవిత్వానికి ఇదొక వేదికగా నిలబడాలి,ఎందరికో ఇదొక వేదికగా ఉండాలి.

2
* ఫిబ్రవరి 15, 2014 - హెచ్చార్కె, ఖాదర్‌ మొహియుద్దీన్‌, విజయ్‌ కుమార్‌ యస్‌ వీ కే, మధు ఇరువూరి కవిత్వం వినిపించారు.
* ఫిబ్రవరి 22, 2014 - కవి నారాయణస్వామి వెంకటయోగితో ఒక కవిత్వ సాయంత్రం కార్యక్రమం జరిగింది.
* మార్చి 21 , 2014 - ప్రపంచ కవితా దినోత్సవం పురస్కరించుకుని కవిసంగమం సీరీస్‌ జరిగింది.
* సుంకిరెడ్డి నారాయణరెడ, జింబో, పసునూరు శ్రీధర్‌ బాబు, నారాయణ శర్మ, మల్లావజ్జల, నిర్మలారాణి తోట పాల్గొని కవిత్వం వినిపిస్తూ, తమ కవిత్వ ప్రయాణం గురించి వివరించారు.
* మే 17, 2014 - దేవరాజు మహారాజు, ఎస్‌.హరగోపాల్‌, వర్మ కలిదిండి, రక్షిత సుమ, పుష్యమీసాగర్‌ లు పాల్గొని, కవిత్వం వినిపించారు.
* జూన్‌ 14, 2014 - రామాచంద్ర మౌళి, స్కైబాబ, వాహెద్‌, అరుణ నారదభట్ల, పసనకర్ల ప్రకాష్‌ లు పాల్గొని కవిత్వం వినిపించారు.
* జూలై 11, 2014 - నాళేశ్వరం శంకరం, ఆర్క్యూబ్‌, మడిపల్లి రాజ్‌ కుమార్‌, శంషాద్‌ మహమ్మద్‌, సురేష్‌ వంగూరిలు పాల్గన్నారు.
* జూలై 26 ,2014 - శంషాద్‌ మహమ్మద్‌ కవితాసంపుటి ఆవిష్కరణ సభ .
* జూలై 27, 2014 - అఫ్సర్‌ ‘‘కవితో ఒక సాయంత్రం’’సభ .
* సెప్టెంబర్‌ 14,2014 - నిర్మలారాణి తోట కవితాసంపుటి ఆవిష్కరణ సభ.
* సెప్టెంబర్‌ 20, 2014 - శిఖామణ, వేముగంటి మురళీకృష్ణ, రాజశేఖర్‌ గుదిబండి పాల్గొన్నారు. కవి వర్చస్వి కవితాసంపుటి ఆవిష్కరణ.
* అక్టోబర్‌ 26, 2014 - డా.రాధేయ, అన్నవరం దేవేందర్‌, డా.కత్తిమండ ప్రతాప్‌, జ్యోతిర్మయి మళ్ళ, గుబ్బల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
* నవంబర్‌ 23, 2014 - శీలా సుభద్రాదేవి, రేణుక అయోల, గద్దపాటి శ్రీనివాస్‌, సి.వి.శారద, కపిల రాంకుమార్‌ పాల్గొన్నారు.
3
కవిసంగమం పొయట్రీ ఫెస్టివల్ 3
2014 డిసెంబర్ 14న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు హైదరాబాద్ ఆబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్‌లో పోయెట్రీ ఫెస్టివల్ జరిగింది. సతీష్‌చందర్ అధ్యక్షతన ఉదయం జరిగిన సభలో ముఖ్య అతిథిగా తమిళ కవయిత్రి సల్మ, అతిథులుగా కె. శివారెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డి, ఎన్. వేణుగోపాల్, వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. పొయట్రీ ఫెస్టివల్ ను ప్రముఖ సంపాదకుడు కే. రామచంద్రమూర్తి గారు ప్రారంభించారు. కట్టా శ్రీనివాస్ కవిసంగమం రిపోర్ట్ సమర్పించారు.
ఈ కవిత్వ పండుగ సందర్భంగా సత్య శ్రీనివాస్ ’నమస్తే తెలంగాణ‘‘ దినపత్రికలో డిసెంబర్ 8న రాసిన వ్యాసం కవిసంగమానికి అద్దం పట్టింది. ఆ వ్యాసం కూడా ఇక్కడ చదవండి.
’’ఇరవై ఒకటవ శతాబ్దం అచేతన కళా ప్రపంచంతో మొదలైంది. అంతటా అన్ రియల్ వరల్డ్ ఎస్టేట్లు ఏర్పడ్డ కాలం. నేలంతా ఒక పెద్ద రూపాయి కాగితాల మూట. కళలకు కాలం చెల్లాయని అనుకుంటున్న రోజులు. కవిత్వం వినడానికి ఎవ్వరికి తీరికలేదు. రాసుకొని జేబులో మడిచి పెట్టుకోవాలి. ఈ స్థితిలో సాంకేతిక పరిజ్ఞానం మనుషుల్ని కలిపేందుకు అంతర్జాలంలో ఓ ముఖపుస్తకం తెరిచింది. తర్వాత మీ నుదిటి రాతలు మీరే రాస్కోండి అంది. కవులు ఎవరి భావనల్ని వాళ్ళ గోడల మీద రాశారు. తర్వాత ఈ గోడ మీద రాతలన్ని ఒకటితో ఒకటి మాట్లాడుకోవడానికి నీడను ఏర్పరిచిన చెట్టు కవిసంగమం.
ఇంకొ రెండు నెలల్లో మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
కవిసంగమం ఫేస్‌బుక్ గ్రూపులో 3000 పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ, రోజుకొక అంశానికి సంబంధించిన వ్యాసాలుంటాయి. ఇప్పుడు కవిసంగమం కవిత్వానికి సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012 నుంచి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుబంధిత అం శాలపై నిరంతర సంభాషణ కొనసాగుతుం ది. అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని పంపిణీ చేయడం, ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ మార్గాన్ని సృష్టించింది.
ఇది ఇన్ ప్రాసెస్ లర్నింగ్ కూడా. కవిసంగమం నేర్చుకోవడానికి శాస్త్రీయ పద్ధతుల్ని ప్రయోగిస్తున్నది. ప్రాసెస్ లర్నింగ్‌లో నేర్పేవాళ్ళు, నేర్చు కునేవాళ్ళు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటా రు. ఇది భాగస్వామ్య పధ్ధతి. కవిసంగమంలోని ప్రాసెస్‌లో వివిధ తరాలకు, పలు శైలి, ప్రత్యేకతలు వున్న కవులు కనపడతారు. అందుకే ఒక పర్టిక్యులర్ సిద్ధాంతానికి, తరానికి లేక కోవకో చెందినది కాదు. పలు రకాల పక్షులకు ఒక చెట్టు గూడు కవిసంగమం.
ఈ ప్రాసెస్‌లో 2013లో లామఖాన్-నిరాశ్రయుల గూడులో మొదలై, గోల్డెన్ త్రిషోల్డ్ బంగారు గడపలో కొనసాగుతున్నది. ఈ బంగారుగడప గాన కోకిల, కవయిత్రి సరోజినీనాయుడు ఇల్లు. హైదరాబాద్‌కే కాక తెలంగాణలో నే ప్రత్యేక స్ధానమున్న ప్రదేశం. విశ్వవిద్యాలయాలలో సాహిత్యంపై చదువులుంటాయి కాని, కవిత్వం ఎలా రాయాలి అన్న పాఠాలు వుండవు. కవిసంగమం హైదరాబాద్ విశ్వవిద్యాలయం గడపలో మూడుతరాల కవులతో ప్రతి నెలా అయిదుగురు కవులుతో ఆ పాఠాల్ని నేర్చుకు నేందుకు కొత్త ఒరవడి సృష్టించింది.
ఈ వేదిక ఉద్దేశ్యం కొత్త తరం పాత తరం నుంచి నేర్చు కోవడం. వాస్తవానికి కవిత్వానికి తరాలతో గొడవ వుం డ దు. ఈ వేదిక తరం మధ్య వుండే గోడను పగలగొట్టే ప్రయత్నం. ఏ కళలోనైనా ఏది అనవసరం అని తెలిస్తే రూపం దానంతట అదే ఆవిష్కరిస్తుంది. ఇలా జరగడానికి కళాకారుడు నిరంతర శ్రామికుడు, పరిశోధకుడు, అన్వేషి అవ్వాలి. అవన్నీ ఈ ప్రక్రియలో ఇమిడి వున్నాయి. అందు కే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు గోడలలో పగ్గుళ్ళు వస్తున్నాయి. తర్వాత అవి కూలిపోతాయి. ఇది కవిత్వాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకునే సంగీత పాఠం.
ఒక నూతన రాష్ట్రం లో ఒక వినూత్న ప్రయత్నం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో వందమంది కవులకు పైగా పాల్గొన్నారు అందు లో ప్రముఖులు, అప్పటికే కవులుగా ఎస్టాబ్లిష్ అయిన వా రు, కొత్త వారు.. వీళ్ళందరూ జుగల్ బంది.
ఇవేకాక ఇతర బాషా కవులతో ప్రత్యేక సదస్సులు జరిగాయి. దీని ద్వారా వివిధ బాషలోని కవిత్వ తీరుతెన్నుల ను వారి అనుభవాల నుంచి మనం స్వయంగా తెలుసుకునే అవకాశం దొరికింది. ఇది విషయ సేకరణకే కాక కవికీ కవికి మధ్యన స్నేహబంధం ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ లో డిలర్నింగ్, రీలర్నింగ్ కూడా జరుగుతుంది. కవిత్వాన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దృష్టితో చూసే అవకాశం ఏర్పడుతుంది.
ఈ వేదిక ఒకరితో ఒకరు, కవిత్వానికి సంబంధించిన అంశాల్ని పదిమందితో పంచుకోవడానికి కవులకు దోహదపడుతుంది. పాల్గొనేవారికి కవి, వాళ్ళ కవిత్వ ప్రస్ధానం ప్రాసెస్‌ను కాప్చర్ చేసేందుకు వీలవుతుంది. ఈ ప్రక్రియ పద్ధతిని సామాజిక శాస్త్రం పరిశోధనలో ముఖ్యంగా నెరటివ్ రిసర్చ్‌లో ప్రయోగిస్తారు. కవిసంగమంలో ఈ ప్రక్రియ ద్వారా సోషియాలజి ఆఫ్ పోయట్రిని కాప్చర్ చేయచ్చు. దీనివల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది.
కవిసంగమంలో జరుగుతున్న ప్రక్రియల్లో కవిత్వానికి సంబంధించిన ప్రత్యేక రోజులను జరుపుకోవడం, ప్రపం చ కవితా దినోత్సవం వంటివి జరుగుతున్నాయి. కవిత్వ ఉత్సవాలు 2013 డిసెంబర్ 15న జరిగిన ఉత్సవంలో ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొఫెసర్ శితాంషు యశస్చంద్ర పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 14న గోల్డెన్ త్రిషోల్డ్‌లో జరగబోయే ఉత్సవంలో ముఖ్య అతిధిగా ప్రముఖ తమిళ కవయత్రి సల్మ పాల్గొంటున్నారు.
ఈ ప్రక్రియ కవిత్వాన్ని పరివ్యాప్తి చేయడానికి జరిగే ఒక మాస్ క్యాంపెయిన్. సోషల్ నెట్ వర్కింగ్‌లో ఎక్కువగా ఉపయోగించే సాధనం. ఇది అడవిలో నిప్పు పెట్టిన ట్టు, ఒకసారి నిప్పు అంటిస్తే ఇక మంటలార్పడం ఎవడి తరం కాదు. సామాజిక అస్తిత్వ పోరాటాలలో ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కవిత్వానికి కొత్త రూపాన్ని అవిష్కరించేదుకు జరుగుతున్నది. జీవ కవిత్వ నినాదానికి కొనసాగింపు.
కవిత్వంలో కవిసంగమం ఒక రినైసెన్స్ సృష్టిస్తున్నది. యూరోప్‌లో కవిత్వం కొత్త పోకడలు సంతరించుకుంటు న్నది. కవిత్వాన్న్ని కోరియోగ్రఫ్ చేస్తున్నారు. గతంలో కొద్ది గా మనదేశంలోనూ జరిగింది. ఈ ప్రయత్నాలన్నీ కవిత్వా న్ని కేవలం రాయడం, చదవడం, అన్నదే కాక వినడం, చూడడం కోసం చేసే ప్రక్రియలు. మన రాతలకు జీవం పోయడం. తద్వారా నిర్జీవమైన మన ప్రాణానికి మనం ప్రాణం పోసుకోవడం.
ఈ మూడేళ్ళ కాలంలో కవిసంగమం కొన్ని వందల కొద్ది ఫోటోలు, వీడియోలు, ఆడియో లు పొందుపర్చింది. ఇది కవిత్వం, కవులకు సంబంధించిన ఆడియో, విజువల్ డేటా. ఇది ప్రాసెస్స్ లెర్నింగ్‌లో కీలకమైనది ముందు తరాలకు పొందుపరచిన నిధి. దీనివల్ల కవులకు విశ్వవ్యాప్తిగా గుర్తింపు లభిస్తోంది. ఇది నేర్చుకున్న వాటిని విస్తరింపచేయడమే కాక, ఇతరుల్ని ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయడం.144 కవితలతో కవిసంగమం-2012 కవితా సంకలనం ప్రచురించింది. ఇందు లో ఎనభై మందికి పైగానే వర్థమాన కవులు అరంగేట్రం చేశారు. ఎంతోమంది కొత్త కవులు తమ తొలి కవితా సంపుటి ఆవిష్కరణకు కవిసంగమం వేదిక అయ్యింది.
జీవితం.. టి.వి. సీరియల్లా కొనసాగుతున్న కాలంలో కవిసంగమం ఒక రిలీఫ్‌తో కూడుకున్న బ్రేక్ నిచ్చింది. కవిత్యం మీద ఇష్టం లేకపోయినా కవిసంగమం ప్రతినెల ఏర్పాటు చేసే కవుల వేదికలో పాల్గొంటే నేటితరానికి కవి త్వం రాక పోయినా పదిమందితో కల్సి కాలం గడిపే లైఫ్ స్కిల్ అయినా వస్త్తుంది. అది కవిత్వం రాయకపోయినా కవితలా బతకాలి అన్న లక్షణం నేర్పిస్తుంది. మనం మన ముందు తరాలకు ఇది ఇచ్చి వెళితే చాలు. అప్పుడు కవి త్వం తప్పక కవిత్వమే అవుతుంది.
కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడం లేదనే దశనుంచి అనేక కొత్త గళాలతో కవిసంగమం నువ్వొక పచ్చని చట్టైతే, పిట్టలు వాటంతటవే వచ్చి వాలేను అన్నమాటను నిజం చేసి చూపింది. జీవనది ఒడ్డునున్న జమ్మిచెట్టు కవిసంగమం. రండి.. ఆ జమ్మి ఆకులతో అలై బలై పండగ చేస్కుందాం..’’
4
2014 సంవత్సరానికి పొయట్రీ ఫెస్టివల్ ద్వారా కవిసంగమం ఘనంగా వీడ్కోలు పలికింది.
పొయట్రీ ఫెస్టివల్ ఉదయం కార్యక్రమాల్లో నాలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈనాటి కవిత పేరిట ఎం. నారాయణ శర్మ కవిసంగమంలో నిర్వహిస్తున్న శీర్షికలో రాసిన వ్యాసాలన్నింటినీ పుస్తకరూపంలో ప్రచురించడం జరిగింది.
75 మంది కవులను, వారి కవితలను నారాయణ శర్మ విశ్లేషించిన పుస్తకమిది. తెలుగులో ఇలాంటి కవితా విశ్లేషణల పుస్తకాలు వెలువడిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే కవిసంగమంలో వాహెద్ రాస్తున్న ఉర్దూ కవిత్వ నజరానా శీర్షిక కింద ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం జీవితంపై పుస్తకం సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే పుస్తకం రెండవది. ఫైజ్ గురించి తెలుగులో బహుశా ఇదే మొదటి పుస్తకం. ఈ రెండు పుస్తకాలతో పాటు చిన్నారి కవయిత్రి రక్షిత సుమ రాసిన కవితా సంపుటి ’’దారిలో లాంతరు‘‘, అలాగే ఒక అద్భుతమైన ప్రక్రియతో ’’నేను మాత్రం ఇద్దరిని‘‘ అనే పేరుతో వర్మ కలిదిండి రాసిన పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన కవిత్వ పఠనం కార్యక్రమాన్ని ప్రసాదమూర్తి, ఏనుగు నరసింహారెడ్డి, కాశిరాజు, కిరణ్‌ గాలి అద్భుతంగా నిర్వహించారు.
మధ్యాహ్నం కవిత్వ పఠన కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా కవిమిత్రులు పాల్గొనడం తెలుగులో కవిత్వం పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. కవిత్వ పఠన కార్యక్రమం సాయంత్రం గద్దర్ తో ముఖాముఖీ కార్యక్రమం వరకు కొనసాగడాన్ని బట్టి కవిత్వం పట్ల ఎంతటి ఆదరణ ఉందో తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు 'ప్రజాయుద్ధ నౌక', 'పాటదండు' గద్దర్‌తో ముఖాముఖిలో సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్‌, జగన్‌రెడ్డి, కోడూరి విజయకుమార్‌ల కవిత్వ సంభాషణ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. కపిల రాంకుమార్ గారు, బూర్ల వెంకటేశ్వర్లు గారు గద్దర్తో కవిత్వ సంభాషణ పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు.
5
కవిసంగమం అనేక కొత్త శీర్షికలతో తెలుగు కవిత్వాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది. సత్య శ్రీనివాస్ రాస్తున్న పర్యావరణణ కవిత్వం ’’మట్టిగూడు‘‘ అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. పర్యావరణ కవిత్వాన్ని తెలుగులో పరిచయం చేసే మొదటి శీర్షిక ఇది. ఇంగ్లీషులో కూడా పర్యావరణ కవిత్వంపై చాలా తక్కువ మాత్రమే రచనలున్న సమయంలో సత్య శ్రీనివాస్ ఈ శీర్షికను నిర్వహిస్తూ తెలుగులో పర్యావరణ కవిత్వం ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
రోజుకో శీర్షిక చొప్పున ఏడు వారాల నగలతో అలంకరించుకుంది కవిసంగమం.
1. ఆదివారం : నౌదూరి మూర్తి (కవిత్వంతో ఏడడుగులు)
2. సోమవారం : కాసుల ప్రతాపరెడ్డి (కవిస్వరం)
3. మంగళవారం : ఎన్. వేణుగోపాల్ (కవిత్వంతో ములాఖాత్)
4. బుధవారం : సత్య శ్రీనివాస్ (మట్టిగూడు)
5. గురువారం : ఎం.నారాయణ శర్మ (ఈనాటి కవిత 2)
6. శుక్రవారం : వాహెద్ (ఉర్దూ కవిత్వ నజరానా)
7. శనివారం : శ్రీనివాస్ వాసుదేవ్ (The Winged Word)
వాటితో పాటు కవిత్వీకరణ, కవిత్వ నిర్మాణ వ్యూహాలు, కవిత్వంలో పారిభాషికపదాల గురించి అవగాహన కల్పిస్తూ, విమర్శనాత్మక వ్యాసాలను, చర్చలను ప్రోత్సహిస్తూ కవిసంగమం 2015లో మరో కొత్త మైలురాయిని తన లక్ష్యంగా చేసుకుని ప్రయాణం కొనసాగిస్తోంది.

No comments:

Post a Comment

Kavisangamam : Logo JpeG By Ramanajeevi